Showing posts with label Andhra kraisthava keerthanalu. Show all posts
Showing posts with label Andhra kraisthava keerthanalu. Show all posts

15 April 2026

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు Nenu naa illu naa intivarandaru


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

24 May 2025

Namo yesu naadha నమో యేసునాధా నాధా


నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత

సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||

1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ
వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||

2. ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా
పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||

3. సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను
మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||

07 October 2024

Odducheri nee yeduta ఒడ్డుచేరి నీ యెదుట

471
Must I go and empty handed


1.ఒడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా
ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా

||ఒక్క యాత్మనైన నేను - రక్షింపక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా||

2.ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్యర్థపరచు వారానాడు - చింతతోడ నిల్తురు ||ఒక్క||

3.యేసువా! నా స్వరక్షణ - నిశ్చయంబు యైనదే
ఐనఫలితంబుజూడ - కష్టపడనైతినే ||ఒక్క||

4.కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతినేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను రాదది ||ఒక్క||

5.భక్తులారా! ధైర్యంతోడ - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసుయొద్ద - చేరునట్లు చేయుడి ||ఒక్క||

20 November 2022

Pilla naina nannu judumi | పిల్ల నైన నన్నుఁ జూడుమీ

538
బాల ప్రార్థన 
రా - ముఖారి, తా- త్రిపుట 

పిల్ల నైన నన్నుఁ జూడుమీ - ప్రియ మైన యేసు - పిల్ల నైన నన్నుఁ జూడుమీ = చల్లని రక్షకుఁడ వనుచు - సత్య వార్తఁ దెలుపుచుండ - నుల్ల మందు నిన్ను నమ్మి - కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||

1.నిన్ను నమ్మి యున్నవాఁడను - ఘన దేవ తనయ - నన్ను దాఁచు నీ నీడను = తిన్నని హృదయంబు నాకుఁ - జెన్నుగా నొసంగి యిపుడు - సన్నుతింప నిమ్ము - నన్ను - సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||

2.ప్రేమచేత నొప్పుచుంటివి - ప్రేమా స్వరూప - ప్రేమలోన నడచు చుంటివి = ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ - బ్రేమచేత బ్రాణ మిచ్చి - ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||

3.పరమ జనకు చిత్త మెప్పుడు - పరమేశ పుత్ర - బిరబిరగను జేయఁగా నిమ్ము = కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు - నరిలలోన నిన్నుఁ గొలువ - ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||

4.బలము మీర నన్ను నిలుపుము - తుల లేనివాఁడ - బలము గల్గు నీదు చేతుల = నిలను నీకు ఫలము లిచ్చి - యెలమి నిన్ను గొప్పఁ జేయ - సలలిత ముగ - నడువ నిమ్ము - చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||
- పులిపాక జగన్నాధము 

Ae deshasthulamaina ae jaathi | ఏ దేశస్థులమైన ఏ జాతి

549
క్రీస్తునందు బాలలు ఒక్కటే
రా - యదుకులకాంభోజి, తా- త్రిపుట 
(చాయ: తనువు నాదిదిగో)

ఏ దేశస్థులమైన - ఏ జాతి మనదైన - యేసులో మన మొక్కటే = ఏకమై బాలల మెల్లరమును తండ్రి - నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

1.పలు దేశములలోన పన్నుగ దేవుని - ప్రార్ధించెడి బాలలం = పరమ తండ్రీ మాలో - ప్రతివారి దీవించు - బహుగా నీ దినమనుచు - బ్రతిమాలి వేడుదము ||ఏ||

2.బహు దేశములలోన - పలువిధుములగు పనులు - పరగజేసెడి బాలలం - ప్రభుడే యేసుని కొఱకే - ప్రపంచమంతటిని - బాగుచేయను మిగుల - ప్రయాసపడుదము ||ఏ||
- సి. విజయ చార్లెస్ 

29 August 2022

Parishudhathma nithyathma | పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ

237
పరిశుద్ధాత్మ స్తుతి
రా - బిలహరి, తా - అట

పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా = దురతేచ్ఛలను దూర - పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

1.నిత్యంపు వెల్గుచే - నింపు జ్ఞానాత్మ = సత్యంపు శుభ వార్త - సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

2.జీవమార్గంబున - జీవింప నేర్పి = త్రోవఁ దప్పిన వారి - భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

3.పాపాంధకారంబుఁ - బాపు నీ వెలుఁగుఁ = జూపి మింటికి నడిపి - కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||

4.భక్తుఁడు శోధింపఁ - బడుచుండునేని = యుక్తిఁ దెల్పెడి సర్వ - శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

5.తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||
– బేతాళ జాన్ 

Vachunu kreesthu vachunu| వచ్చును క్రీస్తు వచ్చును

233
క్రీస్తుని రెండవ రాకడ 
రా - పంతువరాళ్లి, తా - చాపు 
(చాయ: వందనం నీకె)

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును = చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

1.అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె సజీవులై ప్రభు - చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||

2.ఒనరగనుఁదన మేఘ సింహా - సనముపైఁ గూర్చుండి పావన - జనుల బారుల నిరుపార్శ్వము - లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||

3.అదను నిది యని హృదయములు ప్రభు - పదయుగళ సున్నతియెఱుంగక - మద దు రేచ్ఛల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||

4.అమిత పాపాత్ముల నరకలో - కమునఁ బడవైచి సుజన సమూ - హముల దనవెను వెంటఁ గొని చను - విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||

5.తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై -  తల్లడిల్లుచు నొకరి నొక్కరు - నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||
– రావూరి లక్ష్మయ్య 

Yesu vachedi velaye | యేసు వచ్చెడి వేళాయె

234 
ఆయన వచ్చు వేళాయెను
రా - కళ్యాణి, తా - అట 
(చాయ: సంతోషింపరె)

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా -  కాశమేఘములతోను = భాసురమగుతన నివాసంబునకుమనల - దీసుకపోయి ప్రకాశితులను జేయ ||యేసు||

1.నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి - ఓరిమితో నుండరే = భద్రముగా శత్రుయుపద్రవమును దాటి - సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు||

2.తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు - ఘన మహిమలోకి వెళ్లి = తన యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి - చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు||

3.చాలారాత్రి గతించెను సోదరులారా - వెలుగు సమీపించెను = వేల దూతలతోడ యేసయ్యవచ్చును - కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||

4.శోధన కాలమీదే యీధరణిలో - బాధలురావచ్చును =  నాధుఁడైన యేసుపాదముల కడనుండ - యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||

5.మనలను బ్రేమించుచూ మన పాపముల - దనరక్తమున గడుగుచు = ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని - కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు||
– చదలవాడ తామస్ 

09 August 2022

Dharuna magu marana | దారుణ మగు మరణ వారిధి

309
క్రీస్తు సువార్త
రా - ముఖారి, తా - త్రిపుట
(చాయ: ఉన్నపాటున వచ్చుచున్నాను)

దారుణ మగు మరణ - వారిధి దాఁట నె - వ్వారి శక్యము సోదర = ఘోర మగు కెరటములవలె వి - స్తారముగ నేరములు పైఁగొని - పారు చుండునప్పు డద్దరిఁ - జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

1.ఒక్క పెట్టున నెగసి - చక్క వెల్ళుద మన నీ - రెక్క లక్కఱకు రావు = ఎక్కడైనను నోడ గనుఁగొని - యెక్కిపోద మని తలంచినఁ - జెక్క నిర్మతమైన యోడ - లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

2.మంగళ ధ్వనులతో - శృంగారపురము వె - లుంగుచున్నది ముందట = పొంగి పారుచు మరణ నది త-రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి మనకు క్రీస్తు - సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

3.వాద రహితుండైన - యాది దేవుఁడు దాని - నాధుం డనం బరఁగును = బాధ లొందిన నరుల నందరిఁ - జేరఁదీసిన క్రీస్తు యేసు - నాధుఁడే నావి కుఁ డు క్రైస్తవ - వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

4.మానవు లందరు - మరణాంబుధిని దాఁట - మహనీయ మగు నావ యిదె = దీనిలో నెక్కుటకు ముందే - మానుగ వాక్యమును విని సు - జ్ఞాన మొందినవారు క్రైస్తవ - స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

5.విదితంబుగా నిందు - విజ్ఞాన బోదకుల్ - వినిపించుదురు వాక్యముఁ = గొదగొనిన యాత్మములు తృప్తిఁ - గొనును బ్రభు భోజనములోనే - హృదయములలో దేవునాత్మ - యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

6.పలువిధ సంగీత - ములతో సాగుచు మనము - నలయ కుండఁగఁ బోదు ము = బలముగల యీ - యలలు దాఁటి - పరమ పురద్వారముల వెలుపల - గలిసికొని పరిశుద్ధ జనమును - గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

7.కరుణామయుని సభలోఁ - జొరకపోయిన నిత్య - నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు - విరివిగ వినఁ గోరువారలు - మరణ మొందక మును ప్రత్యక్షీ - కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||
    – రావూరి దావీదు 

22 July 2022

Meghambupai nekki meluga | మేఘంబుపై నెక్కి మేలుగ

226
క్రీస్తు ఆరోహణము
రా - ఆనంద భైరవి, తా - త్రిపుట
(చాయ: నీకన్న యిక వేరే)

మేఘంబుపై నెక్కి - మేలుగ ప్రభు క్రీస్తు - యాకసంబున కేగెను = ప్రాకటముగను ఆత్మనంది - ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి - యేక దీక్షను యేసు రాకకు - నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు||

1.యూదయ్య - సమరయ్య - ప్రాంతంబులంతట - నాదు వార్తను జాటరే = భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు - సాదరంబుగ సత్య విశ్వా - సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు||

2.గలిలయ్యులార మీ - రాశతో నెందుకు - తిలకించు చున్నారట్లు = వెలయపరమున కెట్లు నేగెనొ - యిలకు నా ప్రభువట్లెమరల - యలర వచ్చుట మీరు గాంచెద - రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు||

3.శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే - భాసిల్ల మఱి వచ్చును = యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు - నీసు రక్షణ నిలకుజాటుచు - నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబు||
– తూలూరి ప్రకాశము

17 July 2022

Emi ledu sumi jagamulo | ఏమి లేదు సుమీ జగములో

175
క్రీస్తు ప్రేమ సాటిలేనిది
రా - మారువ, తా - అట
(చాయ: ఉన్న పాటున వచ్చు)

ఏమి లేదు సుమీ జగములో యేసుని - ప్రేమ సారము కన్నను = ¹పామరం బేటికి వృధా ²కను - దామరలు మూయగనె చీకటి - యౌ మనంబున నెల్ల సత్యము - గామి గని సర్వంబు విడువుఁ ||డేమి||

1.³దార పుత్రాది బంధు ⁴శ్రేణిపై మమ - కార భావము జెందుచుఁ - దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమఁ గుందుచు = భూరి మాయా జాల బంధా - కర మిది యని తెలియ కీ సం - సార మంతయు నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ||నేమి||

2.ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ - మించు కైనఁ గలదా - దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము - నాత్మ ⁶స మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను నపుడే ⁷దయామృతవార్ధి దిక్కగు ||నేమి||

3.⁸జాయా పుత్రోద్యాన ⁹గృహ విత్తా ట్టాలక - సకల వస్తు జాలము - ¹⁰ప్రతిష్ఠాను - భూతి విధేయులు - నఖిల సంపదలు = నీ యవని లోపల సమర్పణఁ - జేయఁగా బడుఁ గాని యించుక - ¹¹తోయమును గొని పోవశక్యము - లేద హా భ్రమ నొంద నేటికి ||నేమి||
   – విలియం డాసన్ 
________________________________ 
¹మోహము, ²పద్మమువంటి కన్నులు, ³భార్య, ⁴సమూహము, ⁵వలతాళ్ళవంటిది, ⁶మిగుల నాదరణయందు, ⁷దయారసమునకు సముద్రమువంటివాడు, ⁸భార్య, ⁹కోటవాకిటి మీది యిల్లు, ¹⁰అనుభవమునకు, ¹¹జలమును.

Yesuvanti priya bandudu | యేసువంటి ప్రియ బంధుఁడు

174
యేసు మన ప్రియబంధువు
రా - అహిరి, తా - ఆది

యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక - నిహ పరములలో లేఁడన్న = ¹భాసురముగ నిజ భక్తుల కది యను - భవ ²గోచర మెపు డగు నన్న ||యేసు||

1.ఊరు పేరు పరువులు ³మురువులు మరి - యూడఁగొట్టబడినను గాని = ⁴కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ - కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||

2.²ఆడికలు తిరస్కారంబులు మా - కవమానము లున్నన్ గాని = తోడు క్రీస్తుఁడు మాకుండినను - త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||

3.తగ్గుపాటులును సిగ్గుపాటులును - దలమీఁదను వ్రాలినగాని = దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ - సిగ్గును బొందుము తగ్గునఁ ⁶గుందము ||యేసు||

4.ఎన్నెన్నో శోధన బాధలు చెల - రేగి మనలఁ జుట్టిన యపుడు = కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన - ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||

5.మనసు క్రుంగి పలు చింతలచేత - మట్టఁబడిన వేళను మాకుఁ = తన వాగ్దత్తములను జేతుల లే - వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||

6.తల్లిదండ్రులు విడిచిన గాని - తాను వదలఁ డెప్పుడు మమ్ము = ఉల్లమునెత్తి పిలిచిన వేళ - నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||

7.అతఁ డుండని పరమండలము ఇక - వెదకినగాని యగపడదు = క్షతినాతఁ డు మా మతిని వసించిన - అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||
– పురుషోత్తమ చౌదరి
_______________________________
¹శ్రేష్ఠతరము, ²తెలియబడినది, ³సొగసులు, ⁴ప్రేమ, ⁵అపకీర్తులు, ⁶దుఃఖింపము,

22 June 2022

Yesukreesthu dorike neni | యేసుక్రీస్తు దొరికె నేని

172
యేసే మన సమస్తము
రా - నవ రోజు, తా - ఆది 

     యేసుక్రీస్తు దొరికె నేని - యేమికొదువింకేమి భయము = దోసకారి జనుల కెంతోఁ - గ్రాసమవునా యేసు పేరు ||యేసు||

1.తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద =  నెల్లకాలమందు నుంచు - యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||

2.వల్లగాని వశములేని - యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు = కొల్లగా మన కిచ్చెడి దేవ - కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||

3.దండియైన గండములు - మెండుగాను మముఁజుట్టిన = తండ్రివలె మా దరికి వచ్చి - గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||

4.సత్యము మార్గముతానె - నిత్యజీవమింకా తానే = భ్రుత్యుల మనకీయ మోక్షము - భువిని రక్తమంత గార్చె ||యేసు||

5.ఎన్నరాని పాపాత్ముల - కన్నులారా కనికరించి = పున్నెమైన తన ప్రాణము - భువిని బలిపెట్టినాఁడు ||యేసు||

6.ఒడలు నిండా గాయములతో - నడరు చుండమరల లేచి = వెడలి పరమందునుండి - వేడుకలు మాకంపినాఁడు ||యేసు||

7.ఆశతోడఁ తన్ను నమ్ము - యాత్మలకు దర్శనమిచ్చెడి = యేసుతో నింకెవరు సాటి - లేశమైనా లేరుసుండీ ||యేసు||
  – గొల్లపల్లి నతానియేలు

12 June 2022

Aathmanosagumayaa paavanaathma ఆత్మనొసగుమయా పావనాత్మ

757
ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా 
శుద్ధాత్మ దేవా - శుభముల దాత - ఉజ్జీవ మీయుమయా ||ఆత్మ||

1.సీయోను గిరిపైన - ఉన్నత గృహమందు (2)
నీ ఆత్మ వరముల - నొందిన శిష్యుల - అనుభవ మీయువయా ||ఆత్మ||

2.యోర్దాన్ తీరమున - పావుర రూపమున (2)
నీ సుతుడేసుకు - ప్రభవించితివే - ఆ యాత్మ నొసగుమయా ||ఆత్మ||

3.జీవన యాత్రలో - ఎన్నెన్ని అవధులున్నా (2) 
పునరుత్థాన - శక్తితో నింపి - నవజీవ మీయుమయా ||ఆత్మ||

4.ఈ మా సంఘములో - ఐక్యత సమకూర్చి (2)
పరిశుద్ధాత్మ - శక్తితో నింపి - పావన పరచుమయా || ఆత్మ||
– బిషప్ దైవాశీర్వాదం గోవాడ

10 June 2022

Parama rakshaka yesu prabhuva | పరమ రక్షక యేసు ప్రభువా

168 
క్రీస్తు పాపికి ఆశ్రయము
(ఛాయ: ఉన్నపాటున)
రా - అసావేరి, తా - త్రిపుట

   పరమ రక్షక యేసు - ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే = ధరజనంబులుసేయు బహువిధ - దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపఁజేసెడి - దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

1.క్షితి ¹నబ్ధి తీర ²పై కతయైన నెన్ననా - ³యితియౌను లెక్కింపఁగా = ⁴కుతల జన్మంబెత్తియేనిట - బ్రతుకు దినముల - జేయునఘములు - మతి దలపనిమితా ⁵యుతంబులు - పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||

2.⁶పసలేని మాయా దు - ర్వ్యసనంబులను జెంది - దెసదప్పి యున్నాఁడను = వసుధలో దుష్టునికి లోఁబడి - మసలజాలని బలహీనత - ⁷గసటు కన్నులగప్పి కడు మా - నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

3.మదితప్పి గొఱ్ఱెల - మంద బాసినగొఱ్ఱె - చెదరి చలించినట్లు = వదలకెపుడు దురాత్మలైరి స - ముదయమునఁ బడితిరిగి వడిచెడి - మదికి విశ్రమమేమి లేమిని - హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమరక్షక||

4.⁸మదపున్నాగము భంగి - మత్తిల్లి దుర్భావ - హృదయుఁడనై చెడితిని = గొదగొనుచు గాయములతో నా - యెద దృఢంబించుకయు లేమినిఁ - గదల శక్యము గాక మూల్గుచు - గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

5.అమిత దురాత్ముఁడ - నని కడఁ ద్రోయక - క్షమియింపు మీ కరుణచే = తమిని మిక్కిలి దుర్విషయగుణ - సముదంబులు జుట్టి పాపపు - తమము గప్పియు గలుషకానన - సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||
                              – రావూరి రంగయ్య
----------------------------------
¹సముద్రము. ²ఇసుక. ³సాధ్యమాను. ⁴భూమి. ⁵పదివేలు. ⁶కాంతి. ⁷మాలిన్యము. ⁸ఏనుగు.

O vintha naa rakshakuda | ఓ వింత! నా రక్షకుఁడా

167
క్రీస్తుని అద్భుత ప్రేమ
రా - భైరవి,  తా - ఆది

ఓ వింత! నా రక్షకుఁడా నాకై - నీ విలువ రక్తము కార్చితివా = జీవాధిపతి మృతిఁ జెందె నహహా పురుగు - వంటి నాకై నీ - జీవ మర్పించి నావా ||ఓ వింత||

1.నేను జేసిన పా - పములకు నాయన - మ్రానిమీఁదను మూల్గినావా = నేను గ్రహింపలేని - నీ జాలి కరుణ మితి - లేని ప్రేమ దీని - వలనను గనుపడుచు నున్నది ||ఓ వింత||

2.పరమ శరీరుఁడు తా - మరణ రక్తంబుచేతఁ - గరుణతో నన్నుఁ బ్రోచినాఁ డా = మరుతునా యీ ప్రేమ నా - మరణంబు నందు సహా - కర్తృ కటాక్షములు - కలకాల ముండు నాతో ||ఓ వింత||

3.నా యేసు నాధ నీకు - నేనచ్చియున్న దెల్ల - నా లేమితోఁ బ్రేమ గదా = నియమంబు గల ప్రభువా - నీకెట్లు చెల్లించెదను - నన్ను నేనే నీకు - నర్పించుకొనుట గాక ||ఓ వింత||
                           – తామస్ హీలీన్

Yesukreesthu prabhuva memu | యేసుక్రీస్తు ప్రభువా మేము

170 
క్రీస్తుని దయ
రా - ముఖారి,  తా - ఆది

       యేసుక్రీస్తు ప్రభువా - మేము నీ - మోక్షముఁ బొందుటకు = దోసపు లోకము - లోనికి వచ్చితి - దోషులఁ బ్రోచుటకు ||యేసు||

1.పరిశుద్ధుఁడ వీవు - ఇలలో - పాపుల నందరిని = పరిపరివిధ - కృప - వాక్కులతోడను - పిలిచితి వెల్లప్పుడు ||యేసు||

2.సత్యపు నడతలతో - జగతిని - సర్వాద్భుతములను = నిత్యముఁ జేయుచు - నీ కృప చాల - యిలలోఁ దెల్పితివే ||యేసు||

3.అతి పుణ్యాత్ముఁడవే - ¹క్షితిలో - ²వెతలను బొందితివే = మృతిని బొందియు - మూఁడవ దినమున - బ్రతికియు లేచితివే ||యేసు||

4.పాపుల మని తెలిసి - నీదగు దాపున జేరఁగనే =  పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి - ప్రభుఁడవు నీవెగదా ||యేసు||

5.³దురిత వితతి దూరా - నమ్మిన - దురితుల స్నేహితుఁడా = నిరతము మమ్మును - నీ కృప లోపల - నిలకడగాఁ బెంచు ||యేసు||

6.నోరు నిండ నెదలో - నీ కృప - ప్రేరేపణఁగలిగి = సారెకు వేఁడెద - ⁴ముర్వికి రక్షణ - కారకుఁడా నిన్ను ||యేసు||
                        – గొల్లపల్లి నతానియేలు
------------------------------------------
¹భూమిలో. ²కష్టములను. ⁴పాప సమూహమునకు దూరమైన వాడా. ⁴భూలోకమునకు.

Paapi kaashrayudavu neeve | పాపి కాశ్రయుఁడవు నీవే

169  
యేసు పాపికి ఆశ్రయుఁడు
రా - శంకరాభరణము, తా - అట

        పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే

1.ఉన్నత లోకము విడిచిన నీవే = కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి||

2.అజ్ఞాన నాశన ¹బ్రధ్నుఁడవు నీవే = విజ్ఞాన దాయక పరగురువు నీవే - యేసు నీవే ||పాపి||

3.చెదరిన పాపుల వెదకెడు నీవే = చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే - యేసు నీవే ||పాపి||

4.రోగిష్ఠులకు ²స్వస్థ ప్రదుఁడవు నీవే = మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే - యేసు నీవే ||పాపి||

5.నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే = కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే - యేసు నీవే ||పాపి||

6.శాత్రవాంతరమున మృతుఁడవు నీవే = మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే - యేసు నీవే ||పాపి||

7.భవ దీయ పదకంజ దాసుండ నేనే = ³భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే - యేసు నీవే ||పాపి||
                             – మిక్కిలి సమూయేలు
---------------------------------
¹సూర్యుడవు. ²ఆరోగ్యము నిచ్చువాడవు. ³పాపములో మునిగిన వాడనాగు.

09 June 2022

Annaa mana yesu prabhuni | అన్నా మన యేసు ప్రభుని

162
యేసే రక్షకుఁడు
రా - శంకరాభరణం,  తా - రూపకము

   అన్నా మన యేసు ప్రభుని - కన్న రక్షకుఁడు లేఁడు = ఎన్న రాని మన యఘము - లన్ని సడలించి ప్రోచు ||నన్న||

1.మన దోషములకు బదులుగ - మరణావస్థల నొందెను = తన దివ్యావయముల ర - క్తము చిందించెను భువిపై ||నన్న||

2.నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను = విజయం బగు నతని పాద - రజయుగ్మును స్మరించు ||మన్న||

3.దిక్కు మాలిన వారికి - దిక్కై మార్గముఁజూపెను = చక్కనీ గుణముల సొం - పెక్కి వర్తించె నహహ ||యన్న||

4.ఈలాటి దయాసముద్రు - నిల నెందైనను గానము = నీలోఁ గల దుర్గుణాది - జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

5.మృతి గెల్చిన వాఁడే దు - రిత జీవులఁ బ్రోవఁ దగును = మృతి నొంది నశించు లోక - మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||
                              – రావూరి లక్ష్మయ్య

Edugo gorrelakapari sodarulaara | ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా

163 
యేసు గొఱ్ఱెల మంచి కాపరి
రా - పంతువరాళీ, తా - చాపు

    ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా - యిడుగో గొఱ్ఱెలకాపరి = కడగానరాని - కారడవిలో నలసట - పడెడు గొఱ్ఱెలను - పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||

1.చెదిరిపోయిన గొఱ్ఱెనై - దొడ్డికిఁబోవ - ¹ముదములేని వాడనై = మృదుమధురంపు నీ - ²నాదమా లించక కర్త - ³కొదిఁగి యుండక మూఢ - హృదయుఁడనైతి ||నిడుగో||

2.దూరంబునకుఁబోతిని - జనకుని కృపా - సారంబుఁ ⁴గొననైతిని = ⁵కారు మూర్ఖపుపిల్ల - గా సంచరించినా - ⁶కూరిమి యిలుఁబాసి - దారి దొలగిపోతి ||నిడుగో||

3.తనదు గొఱ్ఱెను జూచెను - బోయఁడు తండ్రి - తనశిశువును గాంచెను = కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన ⁷గిరికటకాదు - లను వెంబడించిరి ||ఇడుగో||

4.ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించి యున్నప్పుడు = ⁸త్రాణార్థమగు ⁹నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగా దెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో||

5.చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను = కడిగి గాయములన్ని - గట్టి శుభ్రముచేసి - ¹⁰తడయక నాయింట - నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||

6.ప్రభుయేసు నా బోయఁడు-  యీతఁడె భూమి - ¹¹నభము లేలెడి ¹²రాయఁ డు = శుభమైన తనదివ్య - ¹³శోణిత మొసఁగియ - ¹⁴వ్విభుఁడు ప్రేమించి దీ - వించి స్వస్థముఁజేసె ||నిడుగో||

7.నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొఱ్ఱె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుఁ గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె ||నిడుగో||

8.నేను మూర్ఖపుగొఱ్ఱెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి - నానందముననుందు ||నిడుగో||

9.చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - ¹⁵నెడ్డెతనముఁ గొంటిని = ¹⁶మెడ్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం - తును ముక్తి ¹⁷నిలయంబు ||ఇడుగో||
                          – పురుషోత్తమ చౌదరి
 -------------------------------
¹సంతోషము. ²శబ్దము. ³లోబడి. ⁴పుచ్చుకొను. ⁵మోట. ⁶ప్రేమగల ఇల్లువిడిచి. ⁷పర్వతప్రక్కలు. ⁸బలమైన.  ⁹ప్రేమ. ¹⁰ఆలస్యముచేయక. ¹¹ఆకాశము. ¹²రాజా. ¹³రక్తము. ¹⁴ప్రభువు. ¹⁵మోటతనము. ¹⁶ఆటంకము. ¹⁷నివాసము.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...