163
యేసు గొఱ్ఱెల మంచి కాపరి
రా - పంతువరాళీ, తా - చాపు
ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా - యిడుగో గొఱ్ఱెలకాపరి = కడగానరాని - కారడవిలో నలసట - పడెడు గొఱ్ఱెలను - పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||
1.చెదిరిపోయిన గొఱ్ఱెనై - దొడ్డికిఁబోవ - ¹ముదములేని వాడనై = మృదుమధురంపు నీ - ²నాదమా లించక కర్త - ³కొదిఁగి యుండక మూఢ - హృదయుఁడనైతి ||నిడుగో||
2.దూరంబునకుఁబోతిని - జనకుని కృపా - సారంబుఁ ⁴గొననైతిని = ⁵కారు మూర్ఖపుపిల్ల - గా సంచరించినా - ⁶కూరిమి యిలుఁబాసి - దారి దొలగిపోతి ||నిడుగో||
3.తనదు గొఱ్ఱెను జూచెను - బోయఁడు తండ్రి - తనశిశువును గాంచెను = కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన ⁷గిరికటకాదు - లను వెంబడించిరి ||ఇడుగో||
4.ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించి యున్నప్పుడు = ⁸త్రాణార్థమగు ⁹నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగా దెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో||
5.చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను = కడిగి గాయములన్ని - గట్టి శుభ్రముచేసి - ¹⁰తడయక నాయింట - నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||
6.ప్రభుయేసు నా బోయఁడు- యీతఁడె భూమి - ¹¹నభము లేలెడి ¹²రాయఁ డు = శుభమైన తనదివ్య - ¹³శోణిత మొసఁగియ - ¹⁴వ్విభుఁడు ప్రేమించి దీ - వించి స్వస్థముఁజేసె ||నిడుగో||
7.నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొఱ్ఱె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుఁ గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె ||నిడుగో||
8.నేను మూర్ఖపుగొఱ్ఱెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి - నానందముననుందు ||నిడుగో||
9.చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - ¹⁵నెడ్డెతనముఁ గొంటిని = ¹⁶మెడ్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం - తును ముక్తి ¹⁷నిలయంబు ||ఇడుగో||
– పురుషోత్తమ చౌదరి
-------------------------------
¹సంతోషము. ²శబ్దము. ³లోబడి. ⁴పుచ్చుకొను. ⁵మోట. ⁶ప్రేమగల ఇల్లువిడిచి. ⁷పర్వతప్రక్కలు. ⁸బలమైన. ⁹ప్రేమ. ¹⁰ఆలస్యముచేయక. ¹¹ఆకాశము. ¹²రాజా. ¹³రక్తము. ¹⁴ప్రభువు. ¹⁵మోటతనము. ¹⁶ఆటంకము. ¹⁷నివాసము.
No comments:
Post a Comment