Showing posts with label Telugu Christian Songs lyrics. Show all posts
Showing posts with label Telugu Christian Songs lyrics. Show all posts

05 July 2026

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677
రెండవ అనుబంధము

1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? 
ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె ||ప్రేమా||

2.నిశ్చలమైన ప్రేమజీవికి - యిలలో తావేది 
ప్రేమ ద్రోహులేగాని - ప్రియమున చేరరు వాని 
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా ||ప్రేమా||

3.ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించునురారా
పాపభారముతో - రారా - పాదములపై బడరా 
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||

4.ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల? 
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా 
ఇదియే దేవుని వరము - ముదమారగ జేకొనుము ||ప్రేమా||

28 June 2026

ప్రార్దించు సంఘమా ప్రార్ధనయే Prardhinchu sanghama


ప్రార్దించుము సంఘమ - ప్రార్ధనయే భక్తుని ప్రాణమని

1. ప్రభువైన యేసే ప్రార్ధన చేయగ - ప్రార్ధన బలమేమో గమనించవా
ప్రార్ధనలో జీవమున్నదనీ -ప్రభుని భక్తులెందరో గమనించిరి ||ప్రార్దించు||

2. ప్రార్దించుమని ప్రభువు పలికిన ఆజ్ఞను - వ్యర్థ పరచకుండా జరిపింపవా
స్వార్ధ చిత్తము ‘ వీడి సకల లోకమునకై- ప్రార్ధించి ప్రభు మన్ననలు బొందవా ||ప్రార్దించు||

3. సాతాను శక్తులను పడగొట్టి ప్రభుకొరకు-వెతలనొందువారు ప్రార్ధించిరి
గతి తప్పి మతిపోయి బ్రతుకే లేదనువారు-క్షితిపై ప్రార్ధనలోనే మేలొందిరి ||ప్రార్దించు||

26 June 2026

యేసుని సుచరిత మెంత Yesuni sucharitha mentha

302 
శుభవార్తమాన ప్రకటన 
(చాయ: యేసుని ప్రేమను నేమారకను)
రా - బ్యాగు, తా - ఆది 

యేసుని సుచరిత - మెంత పొనరినది - యెవ్వరు విని యెద - రీ జగతిన్ భాసుర నయ మను - బంధము గలిగిన - భక్తుల కిది సౌ - భాగ్యముగా ||యేసు||

1.దాసుల మొఱలను - దప్పక వినుచును - ధైర్యము నొసఁగెడి - దాత సుమీ = దోసముల గమిఁ - ద్రోయ బలముగల - దొడ్డ దొరకు నుతి - దూతలచేన్ ||యేసు||

2.పాప నరులఁ గని - పావనం బొనర్చను - భార మనని ఘన - బంధు వుఁడు - ఆ పరమ జనకు - నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ - లొందె నుయిలన్ ||యేసు||

3.సిలువపై నిలచి - చేటు వడుచు మరి - చివరకు జనకుని - చిత్తమునన్ = చెలువగ మనవిని - జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు - శ్రీకరుఁడౌ ||యేసు||

4.పాప రహిత య - పార మహిమమున - పాత్రమ మరి కుడి - పార్శ్వ మునన్ = పాపులవిషయము - ప్రార్థన మొనర్చెడి - భావము గల హిత - భాస్కరుఁడౌ నా ||యేసు||

5.దుషులు ననుఁ గని - దూషణ నుడువులు - దగ్ధము లనక - దూరిన నా = ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి - యించుక పగ మది - నెంచను నా ||యేసు||

04 June 2026

రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా Randi yesuni yoddhaku priyulaara

298
యేసునొద్ధకు రండి
రా - మాధ్యమావతి, తా - ఆది 

రండి యేసుని యొద్దకుఁ - ప్రియులారా మీరు - రండి యేసుని యొద్దకు = రండి రండి - రయమున బిలుచుచు - నుండెడి రక్షకుఁ - డొసఁగెను బ్రాణము ||రండి||

1.మీరు పాపంబులఁ ద్యజించి - యేసుని కడకు - రారే వేగము విశ్వసించి = మీరు వచ్చినను - మిమ్మును ద్రోయఁడు - చేరెడు వారిని - జేర్చును దన దరి ||రండి||

2.మీకు బ్రతుకేమి శాశ్వతము - ప్రియ జనులారా - పోకుఁడి యాశించి లోకమును = లోకాశలకును - లొంగుట చేతను - మీకు ఘటిల్లును - మెండగు దుఃఖము ||రండి||

3.మీరేల జాలము చేసెదరు - ప్రియులారా వేగ - రారే కడు భాగ్య మొందెదరు = చేర వచ్చి చిర - జీవము నొందుఁ డ - పార ముదంబును - బడయఁగ దేవుఁడు ||రండి||

- పులిపాక జగన్నాథము

యేసునే సేవింపరండి మోసపోకండి Yesune sevimparandi mosapokandi

294 
క్రీస్తుని గొప్పతనము 
రా - హిందుస్థాని తోడి, తా - ఆది 

యేసునే సేవింపరండి - మోసపోకండి - ప్రభు = దోసములను బాపు నండి - దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||

1.దేవుఁ డీతఁడే సుమండి - దిగులుపడకండి - మన = చావు నొంది లేచెనండి - జీవ మితఁడండి - ప్రభు ||యేసునే||

2.పాపులను ప్రేమించె నండి - ప్రాణ మిడె నండి - ప్రభు = దాపుఁజేరి వేఁ డ రండి - దయామయుఁడండి - ప్రభు ||యేసునే||

3.నరకబాధ నొందె నండి - నరులకొర కండి - ప్రభు = దురితములను బాపు నండి - దుఃఖపడకండి - ప్రభు ||యేసునే||

- ఎన్.డి. ఏబేల్ 

నిజముగా పరిశుద్ధు డొక Nijamugaa parishudhudokadi nelapai

292
పాపము సార్వత్రికము 
రా - కేదరాగౌళ, తా - త్రిపుట 

నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ - నేలపై లేఁడు = ¹వృజినములచేఁ జెడిన మదిని బ -విత్రమూలం బెటుల ²బొడమును ||నిజము||

1.³దురిత లతలకు ⁴మూలకందము - దుస్స్వభావము దానిఁ గూడిన - నరులలోఁ బరిశుద్ధ విధు లె -న్నటికిఁ గనరావు = ⁵నెరవుగా సద్ధర్మములనే ⁶తెఱఁగుననుఁ ⁷గావింప నేర్తురు - ధరణి లోపల ముసిఁడి చెట్టున - చెఱకు రస ముండునె తలంపగ ||నిజము||

2.మనసు క్రియ లన్నిటికి మూలం - బనుచు శాస్త్రము పల్కు మఱి యా - మనసు శుచిగాకున్న నగునే - తనకు క్రియాశుద్ధి = ⁸అనిశ మా హృదయము దురిచ్ఛల - ⁹నలరి ¹⁰మిధ్యాసక్తి నుండఁగ - ఘనతగల సత్యార్య ముల నిల - మనుజుఁడె ¹¹ట్లొ నరింపఁజాలును ||నిజము||

3.నిరతమును పాపాగ్నిచేతను - గరగుచున్న మనంబులోపల - పరమ ధర్మము భక్తి ఎటువలెఁ - బాదుకొని యుండున్ = నిరపరాధి యొకండు లేఁ డని - నిక్కముగఁ గనపచ్చుచున్నది - పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ - పాపులను రక్షింపవలయును ||నిజము||

- పురుషోత్తము చౌదరి
________________________________________
¹పాపము చేత, ²పులుసు, ³పాపమును తీగలకు, ⁴వేరు, గడ్డ ⁵చక్కగా, ⁶విధముగా, ⁷చేయలేరు, ⁸ఎల్లప్పుడు, ⁹సంతోషించి, ¹⁰మాయ, ¹¹చేయగలుగును 

మన మొదటి తల్లిదండ్రులల్ Mana modati tallidandrulal

295
మానవ పతనం
రా - శంకరాభరణం, తా - త్రిపుట 

మన మొదటి తల్లిదండ్రులల్ - మాయకు లోనైరి - అన్నలారా = వారి కనుగొనలకు సిగ్గు - గదుర మోములు వంచి - రన్నలారా ||మన|

1.తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా = కొన్ని - యమరిన మఱ్ఱాకు - లంగంబులను గట్టి - రన్నలారా ||మన||

2.పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ - పాలింప లేరైరి - అన్నలారా = పూర్వ - పరి శుద్ధత నెడబాసి - పాపాత్ములై పోయి - రన్నలారా ||మన||

3.నరవంశజుల కెల్లఁ - తరలెఁ దద్దురవస్థ - అన్నలారా = క్రీస్తు - మర ణంబు మన పాప - హరణంబుఁ గావించు - నన్నలారా ||మన||

- పురుషోత్తము చౌదరి

యేసు నాథ కథా సుధా రస మిదిగో Yesu naadha kadha sudha rasa midigo

299
యేసు నాథ కథా మాధుర్యము
రా - బిలహరి, తా - త్రిపుట 

యేసు నాథ కథా ¹సుధా రస - మిదిగో పానముఁ జేయరే = దోసకారి జనంబులారా - దురిత భవముల బాయరే ||యేసు||

1.ఇహపరంబు లెవనిచే సృజి - యింపఁబడియెనొ చూడరే = అసహహ యా విభుఁ డవతరించెను - అతని గుణములఁ బాడరే ||యేసు||

2.²దురిత భరితుల దుష్ట ²చరితుల - నరయ వచ్చెను జూడరే=స్థిరముగామది నమ్మి యా ప్రభు - కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||

3.పనికిమాలిన ⁴వేలుపుల దెస - పరుగు లెత్తుట మానరే = ⁵తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని - దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||

4.మరణ బలి రక్తమున మన యం -దఱిని బ్రోవను వచ్చెను = కరుణతోఁ బాపులఁ బిలుచు గురు - దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||

5.పరమతత్వ విధాన బోధలు - బాగుగఁ బ్రకటించెను = ⁶చిరసుఖాస్పద పదముఁ గోరిన - జీవులకు వినిపించెను ||యేసు||

6.మరణ మొందిన కొందఱికిఁ దా - మరలఁ బ్రాణము లిచ్చెను = వర మహాద్భుత కార్యముల ని - ద్ధర ననేక మొనర్చెను ||యేసు||

7.కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన - గోష్టి నుండుట గోరరే = దిటముగను నెమ్మదిని మీరొం - దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||

- పురుషోత్తము చౌదరి
______________________________________
¹అమృతము, ²పాపములతో నిండియున్నవారిని, ³దుర్మార్గమైన ప్రవర్తనగలవారిని, ⁴దేవతల, ⁵దేహము, ⁶ఎల్లప్పటికి ముఖకారణమైన. 

పాపులకు సఖుండు మన ప్రాపు Paapulaku sakhundu mana prapu

293
పాపుల స్నేహితుడు
రా - మోహన, తా - ఏక 

పాపులకు సఖుండు - మన ప్రాపు యేసె సుమండి - భువి - పాపులకు సఖుండు ||పాపులకు||

1.రండి రండి మిత్రులార - నిండు ధైర్య పడండి వేగమె = దండైన యండ మన - కుండు యేసుండని ||పాపులకు||

2.దాహ మణంచు దేవ వాక్యము - దేహధారులార రండి = దేహీ యన విహీనుల - సాహాయ్యము నోహో యని ||పాపులకు||

3.ద్రవ్య మించుక లేని విక్రయ - మయ్య యీ యేసయ్య రక్తము = చేయలే మయ్య మన - మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||

4.నిండు మనసు గలిగియే - సండఁజేర రండి వేగమె = నిండు ప్రియుండు న - ఖండ పురుషుండని ||పాపులకు||

5.నింద లన్ని పొంది ప్రభుని - మందలో వెలుఁగొందరే తఱిఁ = పొం దుగ నిందలో - నుందు రానందమున ||బాపులకు||

నమ్మరె నరులార యేసుని సమ్మతిగా Nammare narulaara yesuni sammatiga

296
నమ్మినవారికి రక్షణ
(చాయ: పాపమా దలచు సుమీ)
రా - ముఖారి, తా - ఆది

నమ్మరె నరులార - యేసుని - సమ్మతిగాఁ జేరి = నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును - సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

1.యేసు క్రీస్తుకంటెఁ - పోషకు - లెవ్వరు లేరుసుమీ = దోషుల తన దాసులుగాఁ దీసియు - దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||

2.నరకము నొందక మీ - రయ్యో - నరకము బాధ సుమీ = న్యాయము కాదుసుమి నరులార - నష్టము మీకు సుమీ ||నమ్మరె||

3.తండ్రి కొమరుఁడు విమ - లాత్ముఁడు - త్ర్యేకదేవుండు =  తండ్రి వలెను మనలను పాలించును - తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||

4.ధరణిలో నొకఁడైన - చూడరె - ధన్యుడు లేఁడనుచు = దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు - దీనుల కందఱికి ||నమ్మరె||

6.ప్రభు మన పాపముకై - ప్రాణము - బలిగా - నిచ్చునుగా = పాపము మోసెను మృతియై లేచెను - పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||

7.దేవసుతుని రక్తం - అబ్బిన - ద్రోహుల కతిప్రొయము = పావన మొనరించును పాపికి నిఁక - జీవనమై యుండున్ ||నమ్మరె||

- గెల్లా రామయ్య

02 June 2026

ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ Enduku marachithivi yesuni prema

290
తప్పిపోయిన వారిని మేలుకొల్పుట 
రా - ఆనంద భైరవి, తా - త్రిపుట 

ఎందుకు మఱచితివి - యేసుని ప్రేమ - ఎందుకు మఱచితివి = ఎందుకు మఱచితివి పొందితివి నిందలు - సుందర మగునట్టి - సుఖమైన ప్రభు ప్రేమ ||నెందుకు||

2.దేవగ్రంథము నీవు - చదువలేదా - భావమున దానిఁ గైకొనలేదా = సేవక వృత్తులు - సేయక పోతివి - చావరాని చావు - సంపాదించితి వయ్యో ||ఎందుకు||

3.చిందెను రక్తము - సిలువపైనిఁ - పొందెను గష్టము - మేకుల పోట్ల = నెంద ఱెందఱు కల్వ - రీమెట్టపై నతని - నిందించి చంపిరి - నిర్దయులై యకటా ||ఎందుకు||

4.పాపేచ్ఛలోనుండి - మరలి వాని - శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము = కాపాడుటకు దయతోఁ - గనిపెట్టి యున్నాఁడు - పాపి నీ విభుఁడైన - ప్రభు మార్గమునఁ బొమ్ము ||ఎందుకు||

- దావీదు చౌదరి

ఇక నేమి గతి యున్నది మానవులారా Eka nemi gathi yunnadi maanavulaara

289
క్రీస్తే పాపుల గతి
రా - మాధ్యమావతి, తా - త్రిపుట 

ఇఁక నేమి గతి యున్నది - మానవులారా - యిఁక నేమి గతి యున్నది - పాపులకోస - మిఁక నేమి గతి యున్నది = యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ - డుర్వి లేఁడని ముందె - ప్రకటించి దావీదు - పల్కె వేదము నందు ||ఇఁక||

1.ఇల రక్షకుఁడు లేమిని - గొఱ్ఱెల మంద - లిలఁ జెల్ల చెదు రాయెను = పులులఁ బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్దతి జూప జాలరు ||ఇఁక||

2.దురితము లణఁగింపఁగఁ - బాపుల నెల్ల - దరిఁ జేర్చి బ్రతికింపగ = పర మేశ్వరుఁడు తన - వరపుత్రుఁ డగు క్రీస్తున్ - ధర కంపె నయ్యేసు - శరణుఁ జొరకయున్న ||ఇఁక||

- పురుషోత్తము చౌదరి 

01 June 2026

గ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా Greenland deshasthulunu india

286
From Greenland's Icy Mountains

1.గ్రీన్లాండ్ దేశస్థులును - ఇండియా జనులున్ 
ఆఫ్రికా ఖండమందు - నివాసులెల్లరు 
సముద్ర ద్వీపస్థులు - సువార్త వెలుగు 
మాకు నిప్పించుడని - మమ్మును పిల్తురు.

2.మా దేవుడిచ్చు సుఖ - సుక్షేమ యీవులు 
ఒక్కొక్క దేశమందు - విస్తారమైనను 
అజ్ఞానులైనవార - లా సత్య దేవుని 
గొల్వక వేరువాటిన్ - పూజించుచుందును.

3.సువార్తకాంతి మాకు - ప్రకాశమైనదా 
అజ్ఞానులందరికి - దాని మేమియ్యమా 
రక్షణ దివ్యవార్త - లోకస్తులెల్లరు 
విని మా యేసుమీద - విశ్వాసులౌదురు.

4.సుక్షేమకరమైన - సువార్త సంగతి
గాలి తరంగములు - వ్యాపింపజేయుడీ 
మా సృష్టికర్త రాజు - నిర్దోషి యాయనే 
మా యేసు దిగి వచ్చి - యీ లోకమేలును.
- రెజినాల్డ్ హేబర్

శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు Sri raajilluchu yesu kreesthu

285
క్రైస్తవ ప్రేషితోద్యమము 
దేశీయ ప్రేషితోద్యమ గీతి

1.శ్రీ రాజిల్లుచు యేసు - క్రీస్తు వేంచేసెను 
భారతిని జయించి - ప్రజాళిన్ బ్రోచును! 
ఆరాజు శాశ్వితుండు - భూరిదయాళుఁడు 
వీరాగ్రేసరుండాజిన్ - విజయ ధ్వజంబదె!

2.ఆ హిమాచలమందు - నాటెక్కె మెత్తెను 
కాహళ ధ్వనియందుఁ - గ్రందుకొనెనటన్! 
సౌహార్థ భావమూని - జనాళిన్ బ్రోచుఁగ 
ఆహా యీ యేసుప్రేమ - యాశ్చర్యమైనది!

3.ఆంధ్ర కాశ్మీర వంగ - ఆ సేతువాసులు 
ఆంధ్రప్రాయులైయున్న - యరణ్యవాసులున్ 
బంధ విముక్తలౌచుఁ - ప్రభువైన యేసుని
బంధుర సేవచేయు - వారలయ్యెదరు

4.వీరెల్లఁ క్రీస్తునందు - విశ్వాసముంచిన 
ఆ రాజు వీరిన్ శాశ్వ - తానంద సామ్రాజ్య 
ధౌరేయులన్ గావించు - ఔర! యీ వార్తను
స్ఫారానందంబుతోడఁ - జాటుదు రెవ్వరు!

5.భేరీ తూరారవాది - గా రక్షావార్తను 
దోరంపుఁ గోర్కెఁ జాటు - మో దేశ సంఘమా! 
సౌరభ్యమౌ నీ ప్రేమ - సారంబు జూపుము 
ధీరతన్ యుద్ధమందుఁ - బోరాడి గెల్వుము
- జాన్ చౌదరి

యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా Yesu nin jutu nindu detagaa

284
Here, O my Lord, I see Thee face to face 

1.యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా 
అగోచరార్థముల్ నే ముట్టదున్ 
కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా 
నీ మీఁద వేయుదున్ నా భారము

2.నే దైవాహార మిందె తిందును 
ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్ 
భూభారముల్ నేఁ బారవేయు దున్ 
క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా.

3.సంగీత భోజనాల కాలము 
ప్రభుండు నాకై బల్ల వేసెను 
విందారగించుచున్ నీ తోడి నా 
మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్.

4.సాయం బీవే, వేరే నా కెందుకు 
వేరే చేమీఁద నానుకొనను 
ప్రభూ, నిజంబుగా నీదే చాలును 
నీ శక్తిలోనె బలం బుండున్

5.పాపంబు నాది, నీతి నీదెగా 
నేరంబు నాది శుద్ధి నీదెగా 
నీ రక్త నీతియే నా వస్త్రముల్ 
నా కాశ్రయంబు శాంతస్థితులు
- హోరేషియన్ బోనర్

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము Sthothrarpana narpinthamu japa dhupamu

283
పరిశుధ్ధ సామభక్త్వము 

స్తోత్రార్పణ నర్పింతము - జప - ధూపము వేసి కీర్తింతము - పాత్రుం డైన శ్రీ యేసుఁడు - పరమ - భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||

1.కృతజ్ఞతా స్తోత్రంబులన్ - దేవ - కృపార్థంబై చేయుదము = క్షీతి నాతండు బలి నియ్యఁగాఁ - పుట్టె - నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||

2.పాపము లన్ని హరించెను - మా - ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ దీనిఁ దలంచుచు - నిఁక - నెన్నఁడు యేసుని భజింతము ||స్తోత్రా||

3.చావు నుండి రక్షించెను - స - జీవులలో లెక్కించెను = దేవుని కిఁక నర్పింతము స - జీవార్పణ బలిగను ||స్తోత్రా||

3.పుణ్యరక్త శరీరముల - లోఁ - పాలొందు మన మందరము = అన్యులము కానేరము - దై - వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||

4.మరణ శ్రమల స్మరింతము - ప్రభు - తిరిగి వచ్చు పర్యంతము = ధర నా యేసు మరణంబును - యింకఁ చిరకాలంబుఁ జాటింతము ||స్తోత్రా||
- సమూయేలు పాక్యానాధము

మన యేసు మరణస్మా రణ Mana yesu marana smarana

282
ప్రభు భోజనమున కాహ్వనము
(చాయ: పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని)
రా - భైరవి,  తా - త్రిపుట 

మన యేసు మరణస్మా - రణవిందులోఁబాలు - గొనరండు ప్రియులార - వినయమానసులై = మన దోష చయమెల్లఁ - దనమేన ధరియించు - కొనిమనల గావ నా - యన పడిన శ్రమలెంచి ||మన యేసు||

1.మరల మన మధ్యకా - పరమాత్ముఁడరుదెంచ - వఱకాయనను మనము - మఱవకుండుటకై - స్థిర భక్తి నద్దాని - జరిగింపవలెనంచు - గురుతరంబగు నాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన ||మన యేసు||

2.తినుఁడిది యె నా దివ్య - తనువంచు నొక రొట్టి - యను వ్రచ్చి ప్రభుఁ డిచ్చె - ననుబంధుతతికి = ఘన శ్రద్ధదానిఁగై - కొని మనము - భుజియింప నొన గూడు జిరజీవ - మనుమాన మిఁకనేల ||మన యేసు||

3.ఆ రీతి నిజరక్త - ధారయై వెలయు ద్రా - క్షారసము నిచ్చె నిం - పార గొను డనుచుఁ = గోరి యా మధుధారఁ గ్రోలిన మనకుక్షి - దోరమౌ జీవంపుధార లుద్భవ మొందు ||మన యేసు||

4.ప్రభు భక్తి నెవఁడు దై - వభయంబు లేక య - నుభవించు వానిక - శుభమౌ నా మీఁద = విభవంబు దొలఁగురో - గభయంబు చేకూరు - శుభ మవ్వానికి నెపుడు - లభియింపదని తెలిసి ||మన యేసు||

5.మిము మీరె తగురీతి - గమనించి పరిశోధ - నము చేసికొని మీ పాపము లోప్పుకొనుచు = నమితార్తిఁబశాత్తా - పముఁబొంది యీ విందు - క్రమము బాటింప క్షే - మము మీకు సిద్ధించు ||మన యేసు||

6.దురితాంధకార భా - స్కరుఁడు సద్గురుఁడేసు - పరమవిందున కిది యను - ప్రాసంబని యెఱిఁగి = ¹ఉరణశాబకరక్త - సరి దంతఃపరిపూతాం - బరులైసత్కార్యత - త్పరులై బంధురమతులై ||మన యేసు||
- దాసరి మోజెస్ 
_____________________________________________
¹ గొర్రె పిల్ల రక్త ప్రవాహమున నుదుక బడిన వస్త్రములు గలవారై 

మానవుఁడవై సకల నరుల Maanavudavai sakala narula

281
నూతన నిబంధన విందు 
(చాయ: యేసు క్రీస్తూ దొరికెనేని)
రా - భైరవి, తా - చాపు 

మానవుఁడవై సకల నరుల - మానక నా దోషములఁ - బాపుటకు బలి యైతివే యేసూ - బహు ప్రేమతోడ ||మానవుఁడవై||

1.నీదు బలిని నిత్యముగను - నిజముగా ధ్యానించి ప్రేమను - నీదు దివ్య ప్రేమ నొందుటకు - నియమంబు నిచ్చి ||మానవుఁడవై||

2.నీవె జీవపు రొట్టె వంటివి - నీవె జీవ జలంబు వంటివి - నిన్ను ననుభ వించుఁడంటివిగా - నిజదేవా యేసూ ||మానవుఁడవై||

3.నీ శరీరము రొట్టెవలెనే - నిజముగా విరువంగఁబడెనే - నిన్నుఁ దిను భాగ్యంబు నిచ్చితివే - నా యన్న యేసూ ||మానవుఁడవై||

4.మంచి యూట మించి దండి - పంచగాయములలో నుండి - నిత్యజీవపు టూటలు జేసితి - నీ ప్రేమ నుండి ||మానవుఁడవై||

5.నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు - నీదు ప్రేమ బలిలో మనుటకు - నిత్య మాచరించుఁడంటివి నీ - నిజభక్తితోడ ||మానవుఁడవై||

6.ఎంతో ప్రేమతో బలిగా నైతివి - యెంతో ప్రేమాచారమైతివి - చింతలును నా పాపములు బాప - శ్రీ యేసు దేవా ||మానవుఁడవై||

7.నిత్యబలి యగు నిన్నే నమ్మి - నిన్ను ననుభవించి నెమ్మి - నిన్ను నిముడించుకొని నాలో నీ - నిజరూప మొంద ||మానవుఁడవై||

8.నేను నీ బలిలోనఁ గలిసి - నేను నీతోఁ గలిసి మెలిసి - నేను నీవలె నుండఁ జేసితివే - నా దివ్య యేసూ ||మానవుఁడవై||

9.నీదు శ్రమలను బలిని నిపుడు - నాదు కనులు చూడ నెపుడు - నాదు పాపభారములు దిగునే - నా దివ్య యేసూ ||మానవుఁడవై||

10.నీవు బలియై తిరిగి లేచి - నిత్య తేజోరూపు దాల్చి - నిత్యమును నా బంతి నున్నావే - నిజ దేవా యేసూ ||మానవుఁడవై||

11.నీవే నీ చేతులతో నిత్తువు - ఈ నీ బలివిందునకు వత్తువు - నిన్ను నిట జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై||

- మార్తాండ ఙ్ఞానప్రకాశము

చేరి భుజియింపుడీవిందు యేసు Cheri bhujimpudivindhu yesu

280
ప్రభురాత్రి సంస్కారవిందు 
(చాయ: సోదరులారా గనుడీ యాశ్చర్యం)
రా - కేదార, తా - అట 

చేరి భుజియింపుడీవిందు - యేసు - సిద్ధపరచిన కృపావిందు = తోరణంబగు మేడ గదిలో - జేరి శిష్యుల తోడ సిలువ = భారమున్ మదినెంచి నెరపిన - భావ గర్భితమైన విందు ||చేరి||

1.జీవాహారము దైవసుతుడే - పరమ - జీవజలముల దాత యితడే = జీవనాధుని రక్త మేనులు - జీవానాహారములు కాగా - చావును దొల గించి మృతులస - జీవులనుగా మార్చువిందు ||చేరి||

2.కారుణ్యనిధి యేసు రాజు - నరుల - గావగ బలియైన రోజు = భారమైన సిలువ కెరయై - పాప భారము పరిహరింప = ధారవోసిన పుణ్యరక్తపు - ధారలన్ దలపోయు విందు ||చేరి||

3.దాసగణముల బ్రోవనెంచి - రుధిర - ధారలను గార్చిభరించి = భాసు రంబగు నవ నిబంధన - జేసి సంఘ పునాది వేసి = వాసి మీరగ నిత్య జీవము - బోసినట్టి యేసు విందు ||చేరి||

4.పాప పరిహారార్థముకై - క్రీస్తు - పడిన ఘోరబాధ కొరకై = యేపు దనరగ స్తుతులుబాడుచు - యేసునాధుని రాకవరకు = ఆపకుండగ సత్ప్రసాదము - నందుకొని బలమొంద రండి ||చేరి||

5.విందుతో మొదలిడిన సేవ - యేసు - విందుతో ముగియించె బ్రోవ = విందులోగల మర్మమేదియొ - విపులముగ బోధించు క్రీస్తున్ = డెందమున ధ్యానించి యాయన - యందె నమ్మిక గలిగియుందము ||చేరి||
- వి. డి. జాన్ సుందరరావు 

దేవా దీవించు మిప్పుడు Deva deevinchu mipudu

279
ప్రభురాత్రి భోజన మాచరించునపుడు దీవెన గోరుట 
(చాయ: దేవా యాశీర్వదింపుము)
రా - హునేని, తా - త్రిపుట 

దేవా దీవించు మిప్పుడు - దీన జనాళిన్ - గావ రా రమ్మెల్లప్పుడు = నీ వరగద్దెచుట్టు - నిజ దాసు లిటులఁ గూడి - పావన సంస్కారమును - బంచి పాలొందుచుండ ||దేవా||

1.మముఁ గావ నైదు గాయముల్ - బొందిన దేవ - సముఁడా నీ రక్త కాయముల్ = విమలింపు భక్తి ద్వారా - వీక్షించి మనసులందు - అమిత దుః ఖ మొందుటచే - నలిగిన భక్త జనులన్ ||దేవా||

2.నీ రాజ్యమునకు మముఁ జేర్ప - నిజము మా పాప - ఘోర శాపమ్ములన్ దీర్ప = నోరిమిచే మా కొరకు - దారుణముగ నొందిన - క్రూర మరణమును దలఁచి - కుములుచున్న హృదయులను ||దేవా||

3.కోరి నినుఁ గొలుచు భక్తుల - కోరిక లభివృద్ది - గా రాజిలఁజేయు శక్తుల = ధారాళముగ నొసంగు - ధనాత్ముండ నీ దివ్యా - కార మందుండి యీ సం - స్కార సమయమున మమ్ము ||దేవా||

4.మా దారిద్ర్యములు బాపనే - పాపభారంపు - మ్రాను నీ దివ్య మూపుననే = గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో - బాధ లొందితి వనుచు - బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||

5.నీ వీ విధంపు మరణముచే - నిజముగా మమ్ము - జీవింపఁజేసి నిల్పుటచే = పావనదేవ మే మీ - ప్రభు సంస్కారమ్ము మా - మా జీవాత్మ లాదరణకై - జే మనముగఁ గైకొనను ||దేవా||
- మురారి దావీదు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...