300
వచ్చి క్రీస్తును చూడుఁడి
రా - కాంభోజి, తా - ట
రారె యేసుని జూతము - కోరిక దీర - రారే యేసుని జూతము = రారె యేసుని జూడ - రారాజై మన జీవా - ధార కరుణా మృత - సారమై యున్నాడు ॥రారె॥
1. సారహీన మగు ¹సం - సారాబ్ధిలో జిక్కి - భారమనుచు నీత - నేరని వారికి - ²తారకమైన దేవ కుమారుడు యేసు - డూ ³రార్చు చుండుటకు - ⁴భూరి సహాయ - కారియై చేయూతకు = గోరియిచ్చుచు క్షేమ - తీరంబు నకు జేర్చ - దారిజూపుచు మీ వి - చారముల్ దొలగించు ||రారె||
2. ఘోరమైన పాప - భారంబు మోయుచు - దారి గానక తారు - మారులైన నరుల - గూరిమితో బిల్చును - ⁵నారక బాధ - ⁶లూరక దొలగించుచు - నీరసు లంచు - భారంబుతా మోయుచు = నోరి మధికము జూపి - నేరంబు బాపి శృం - గారమైన మోక్ష - ద్వార మై యున్నాడు ||రారె||
3. కారుణ్యుడును నిర్వి - కారుడు దురితోప - కారుండు శుద్ధాలం - కారుండౌ యేసుని - నే రీతిగా వింటిమో - యా రీతిని మో - ⁷క్షారామమున జూతుము - సార ⁸వాక్య - ధోరణిన్ బడి పోదము = దారుణంబగు శ్రమలు - బారు బారుగా నున్న - ⁹పోరి దాటి ప్రభుని - జేరి సుఖింతము ||రారె||
4. ఆ రమ్యపురిన బ్రే - మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది - సారెసారెకు ప్రభుని - ¹⁰నారావముగా స్తోత్రము - ¹¹చారుతర దే - వా రాధనము జేతము - నోరార నా - పేరు నే పూజింతము = దూరస్థులై యున్న - వారలం దన రక్త - ధారోదకముచే ¹²జే - కూరునట్లుగ జేయు ||రారె||
- బేతాళ జాన్
________________________________
¹సముద్రమువంటి లోక జీవనము. ²దాటించునదియై. ³ఓదార్చుట. ⁴గొప్ప ⁵ఘోరమైన. ⁶ఉచితముగ. ⁷తోటలో. ⁸వాక్య ప్రవాహములో. ⁹పోరాటము. ¹⁰శబ్దముతో. ¹¹మనోహరమైన. ¹²చేతికి దొరుకునట్లుగ.
No comments:
Post a Comment