అన్ని పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నాయి


🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

నేడు దిన ధ్యానము

✝️అన్ని పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నాయి✝️

అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలంగానే ఉన్నావని వారితో చెప్పెను.
 ఆది 42 : 36.

యాకోబు కుమారులు ధాన్యం కొరకు ఐగుప్తుకు వెళ్లి, ధాన్యపు మూటలతో వచ్చి షిమ్యోనును ఐగుప్తులోనే విడిచిపెట్టినట్లు చెప్పినప్పుడు యాకోబు ” అన్ని నాకు వ్యతిరేఖంగానే ఉన్నాయి” అంటున్నాడు.

ఇశ్రాయేలు కుమారులు మొదటిసారి ధాన్యమును కొనడానికి ఐగుప్తుకు వెళ్లినప్పుడు యోసేపు వారి కన్నుల ముందర షిమ్యోనును కావాలనే బంధించాడు. వాళ్లు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు యాకోబు చాలా నిరుత్సాహపడ్డాడు. “ఒకరి తరువాత ఒకరు నా కుమారులను నేను పోగొట్టుకున్నాను” అని అంటున్నాడు. “ఇంకా ఇవన్నీ నాకు వ్యతిరేఖంగా ఉన్నాయని” అంటున్నాడు. కానీ నిజానికి ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క మంచికే జరుగుతున్నాయి.

ఆదికాండము 45 : 4,5,7,8 లో, యోసేపు “నా దగ్గరకు రండి” అని తన సహోదరులతో అన్నాడు. అప్పుడు అతని అన్నదమ్ములు అతని దగ్గరికి వెళ్లారు. అప్పుడు యోసేపు “నేను మీ సహోదరుడనైన యోసేపును, మీరు ఐగుప్తు నుండి అమ్మివేసిన యోసేపును. కానీ మీలో మీరు దుఃఖపడుకుడి, కోపపడకుడి. మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి, దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును, ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు” అని వాళ్ళతో ఇంకా మాట్లాడి తన తండ్రితో సహా అందరినీ, ఇంకా బంధువులందరినీ ఐగుప్తుకు తెచ్చుకున్నాడు. చివరికి యాకోబు చాలా సంతోషించాడు.

మీరు మీ జీవితంలో అన్ని వ్యతిరేఖంగా జరుగుతున్నాయని అనుకుంటున్నారా? మీ మంచికి ఏదీ కూడా సమకూడి జరగడం లేదని అనుకుంటున్నారా ? దిగులు పడకండి. మీకు వ్యతిరేఖంగా జరుగుతున్నాయని మీరు అనుకునే సంగతులన్నీ మీకు సమకూడే జరుగుతున్నాయి.

🛐ప్రార్థన:🛐

ప్రభువా, మీ ఆలోచనలను , ప్రణాళికలను , ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉ఎప్పుడైతే మీరు వ్యతిరేక ఆలోచనలను సానుకూల ఆలోచనలతో మార్చి వేస్తారో, అప్పుడే మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. – విల్లి నెల్సన్.

No comments: