నిన్ను నీవు కనపరచు కొనుటకు సిద్ధపాటు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪
 *నిన్ను నీవు కనపరచు కొనుటకు సిద్ధపాటు* 

"కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రా యేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి." 
 - ఆమోసు 4:12

ఇశ్రాయేలీయులు తమ జీవితాలలో దేవుని మాటలు హెచ్చరికలు శిక్షలు విధానాలని నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేల్ లోని ధనికులూ అధికారులూ కూడా తన సంపద పోగు చేసుకుంటూ పేదలను బాధించారు. వారు ఇతరులకు చేసే విధంగానే దేవుడు వారికి చేస్తాడు. దేవుని శాసనాలకూ విరోధంగా అనేకమైన పాపాలు చేసిన వారిని శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి వారిని పవిత్రమైన వారిగానూ, నీతి న్యాయాలు గల జనాంగముగాను పేదల పట్ల దయ చూపించే జనాంగము గాను ఉండేందుకు దేవుడు వారికి సమృద్ధిని అనుగ్రహించాడు. ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేసినట్లయితే శిక్షింప బడతారు. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేరు. అందుకే బహు జాగ్రత్తగా దేవుడు నీ యెడల కృప చూపినట్లు, నీవు కూడా దీనుల పట్ల కృప చూపించేలా జీవించాలి. దేవుని తీర్పు ఎదుర్కొనేందుకు నీవు సిద్దపడి ఉండాలి పశ్చాత్తాపపడి ఉండాలి. "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి" అనే వాక్యాన్ని నీ జీవితానికి హెచ్చరికగా చేసుకుని జీవించాలి. మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడు చెప్పబోయే దాన్ని వినేందుకు సిద్ధపడాలి. నీతి న్యాయాలు అనుసరించి జీవించుటకు సిద్ధపడిన వారుగా ఉండాలి. నాకు ఏం దొరుకుతుందా అని చూడడం కంటే ఇతరులకు ఎలా సహాయం చేద్దాం అని ఆలోచించడం శ్రేష్టం. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని బహు జాగ్రత్తగా ఆయనను వెదకి ఆయన ఎదుట సిద్ధపడిన మనసుతో నిలబడాలి. అటువంటి జీవితం జీవించడానికి దేవుని కృప నీకు తోడైయుండును గాక!

 🛐ప్రార్థన🛐

నా రక్షకా! నీవు నన్ను చూసినప్పుడు నేనును మీ వంటి స్వరూపమును కలిగి జీవించునట్లు నన్ను నేను నీ ఎదుట కనపరచు కొనుటకు సిద్దపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

No comments: