అందుకు రాజు – మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి: 25:40.


నేడు దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

(నాకు మీరు చేసితిరి)

అందుకు రాజు – మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని 
నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 
మత్తయి: 25:40

రెబెకా అను సహోదరికి రాత్రి వేళ ఒక ఫోను కాల్ వచ్చింది. అవతలి వైపున ఉన్న వ్యక్తి “ఇక్కడ మురికి కాల్వలో ఒక శిశువు పడి ఉన్నాడు. వచ్చి మీ ఆశ్రమముకు తీసుక వెళ్ళండి” అని చెప్పాడు. ఆమె వాళ్ళు చెప్పిన స్థలానికి వెళ్లి, మురికి కాలవలో, నల్లటి నీరులో ఉన్న శిశువును చూచి, తీసుకొని, ఎత్తుకొని, తమ ఆశ్రమానికి తెచ్చి, స్నానం చేయించింది. ఈ స్త్రీని నేను వ్యక్తిగతంగా ఎరిగియున్నాను. అనేక సార్లు ఆమె ఆశ్రమమును కూడా దర్శించాను. ఆమె అనాధ పిల్లలకు, కర్ణాటకలోని హొస్పెట్ దగ్గర ఒక ఆశ్రమము నడుపుతుంది. ఆమె అలాంటి అనేక పిల్లలకు ‘అమ్మ’. ఈ శిశువును నేను కూడా నా స్వంత కళ్ళతో చూశాను. మళ్ళీ ఇంకొకసారి ఆమె ఆశ్రమాన్ని మేము దర్శించినప్పుడు, ఆ శిశువు పెరిగి చిన్న బాబుగా అయ్యాడు. ఆమెకు అరవై ఏళ్ల వయస్సు పైబడినప్పటికీ, గొప్ప పని చేస్తున్నది. అనేక కష్టాలతో, అనారోగ్యముతో కూడా పిల్లలకు సేవ చేస్తున్నది. ఆమెకున్న పెద్ద ఇంటిని వదిలి వేసి వచ్చి, అనాధ బాలలతో కూడా ఆశ్రమంలోనే ఉంటున్నది.

మత్తయి 25:40 లో, యేసుప్రభువు అదే అంటున్నారు. “నాకు ఆహారమిచ్చారు, బట్టలు ఇచ్చారు” అంటున్నారు. అపుడు అక్కడున్న వాళ్ళు, “మేమెప్పుడు మీకిచ్చాము “అని అడుగుతున్నారు. అప్పుడాయన “మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” అని అంటున్నారు. కనుక మనము స్వార్థపరులుగా ఉండక, అవసరత ఉన్న వారికి, పేద వారికి సహాయం చేస్తూ, వారి కష్టాల్లో ఆదుకుందాము.

🛐ప్రార్థన:

ప్రియమైన తండ్రీ, మీరు కొలువడానికి అసాధ్యమైనంత ఎక్కవగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ విధంగానే, మేము కూడా ఇతరులను, మరి ముఖ్యంగా, పేద వాళ్ళను, అదే ప్రేమతో ప్రేమించడానికి మాకు నేర్పమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

మనము ప్రతి ఒక్కరికీ సహాయము చేయలేము కానీ ప్రతీ ఒక్కరూ, మరొక్కరికి సహాయము చేయగలరు. – డాక్టర్ లొరెట్టా స్కాట్.

No comments: