Charles Stewart Thompson | చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్

📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్ Charles Stewart Thompson* 🛐
జననం            : 17-08-1851
మహిమ ప్రవేశం: 19-05-1900
స్వస్థలం           : ఈసింగ్టన్
దేశం                : యునైటెడ్ కింగ్‌డమ్
దర్శన స్థలము  : భారతదేశం 

       భారతదేశములో పురాతనమైన అతిపెద్ద తెగలలో ఒకటైన భిల్ అనే తెగవారి మధ్య మొట్టమొదటిగా సేవ చేసిన వైద్య మిషనరీ చార్లెస్ స్టువర్ట్ థాంప్సన్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థాంప్సన్ తమ గ్రామములో ఉన్న స్థానిక క్రైస్తవాలయమునకు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. ఇది అతను విశ్వాసములో ఎదుగునట్లు సహాయపడింది. అతను ‘కాలేజ్ ఆఫ్ ఇస్లింగ్టన్’ లో వైద్యశాస్త్రములో శిక్షణ పొందిన తరువాత, ‘చర్చి మిషన్ సొసైటీ’ అతనిని చేర్చుకొనుటకు అంగీకరించి, భారతదేశములోని భిల్ తెగవారి మధ్య మిషనరీగా సేవ చేయుటకు థాంప్సన్‌ను నియమించింది.

              1881వ సంll లో రాజస్థాన్‌లోని ఖేవారా మిషన్ స్థావరమునకు వచ్చిన అతను, అక్కడ వైద్య మిషనరీగా తన పరిచర్యను ప్రారంభించారు. అయితే, వైద్య సేవల ద్వారా భిల్ ప్రజలతో సంబంధములను ఏర్పరచుకొని వారిని క్రీస్తు కొరకు సంపాదించవలెననిన థాంప్సన్ యొక్క ప్రణాళిక విఫలమైంది. ఏలయనగా ఈ ప్రాంతములోని భిల్ ప్రజలకు పాశ్చాత్య ఔషధం మీద నమ్మకం లేకపోవడం మాత్రమే కాదు, ఆంగ్ల వైద్యులు వారి శరీరములకు హాని చేస్తున్నట్లు వారు భావించారు. అందువలన, ప్రజలలో నమ్మకమును కలిగించుటకై థాంప్సన్ ఆసుపత్రి యొక్క మౌలిక సదుపాయములను విడిచిపెట్టి, వైద్య చికిత్సను అందించుటకై ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. క్రమంగా, అతని యొక్క ఈ తాత్కాలిక ఏర్పాటు విజయవంతమవ్వగా, చికిత్స పొందుటకై చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు అతని యొద్దకు రావడం మొదలయ్యింది.

        తరువాతి 16 సంవత్సరాల కాలం గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్ర ప్రాంతములను పర్యటించిన అతను, ఆ ప్రాంతములలో వైద్య సేవలను అందించి, చిన్న చిన్న వైద్యశాలలను మరియు ఔషధాలయములను స్థాపించారు. ప్రజలకు చికిత్స చేస్తున్నప్పుడు వారికి సువార్తను కూడా అందించేవారు థాంప్సన్. అంతేకాకుండా అనేక పాఠశాలలను కూడా స్థాపించిన అతను, భిల్ భాష యొక్క మాండలికంలో ప్రార్థనల పుస్తకమును కూడా ప్రచురించారు. అతను సువార్తను ప్రకటించే విధానమేమనగా వ్యక్తిగతముగా ఇతరులకు సువార్తను చెప్పడం. అయితే, శారీరక ప్రయోజనముల కొరకు క్రీస్తును అంగీకరించమని అతను ఏనాడూ వారిని అడుగలేదు. అతను చేపట్టిన ప్రయత్నముల వలన ప్రజలు నెమ్మదిగా తమ భిల్ విశ్వాసములను మరియు సంప్రదాయములను విడిచిపెట్టి, యేసు క్రీస్తును విశ్వసించడం ప్రారంభించారు. 1899-1900 సంll మధ్యకాలంలో చప్పానియా కరువు సంభవించి భిల్ ప్రజలను తీవ్రముగా దెబ్బతీసినప్పుడు, థాంప్సన్ ఒంటిగానే అనేక సహాయక కేంద్రములను ఏర్పరిచారు మరియు మరణపుటంచులలో ఉన్న వేలాది మంది పిల్లలను రక్షించారు. ఆ సమయములో కలరా బారిన పడిన అతను, భూసంబంధమైన తన సేవలను విరమించుకొని, పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.

           థాంప్సన్ చేసిన సేవ భిల్ తెగ యొక్క ప్రాంతములో తరువాతి మిషనరీ పరిచర్యకు పునాది వేసింది. మొదటి ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించుటకు అతనికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే, మొట్టమొదటిగా భిల్ ప్రజల మధ్య అతని ద్వారా ప్రారంభించబడిన మార్గదర్శకమైన సేవ ఎంతో కాలము తరువాత ఫలములను ఫలించగా, ఆ ఫలము యొక్క సంతోషమును అతని తరువాత ఆ పరిచర్యను కొనసాగించిన వారు అనుభవించారు.

🚸 *ప్రియమైనవారలారా, మీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆత్మీయ మరియు శారీరక అవసరతలను గురించిన చింత మీలోనున్నదా?* 🚸

🛐*"ప్రభువా, అవసరతలలో ఉన్నవారికి సహాయమందించుట ద్వారా మీకు సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
*ఒక మిషనరీ జీవిత చరిత్ర* ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే, ఇతరులు కూడా ప్రయోజనం పొందులాగున దీనిని అందరికీ పంపి, *ప్రభువును సేవించుటకు* వారిని ప్రోత్సహించ మనవి!
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
తెలుగు అనువాదం: ఆర్. ఆర్. ప్రియాంక

No comments: