Apollos | అపొల్లో

📚*ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *అపొల్లోApollos * 🛐
జననం:             1 వ శతాబ్దం 
మహిమ ప్రవేశం: 1 వ శతాబ్దం 
స్వస్థలం:             అలెగ్జాండ్రియా (అలెక్సంద్రియ), ఈజిప్టు 
దర్శన స్థలము:     ఎఫెసు మరియు కొరింథు

                అపొస్తలుడైన పౌలు యొక్క సహపరిచారకుడు అపొలో. అతను ఎఫెసు మరియు కొరింథులలోని ఆది సంఘములను అభివృద్ధిపరచుటలో కీలకపాత్ర పోషించారు. ఒక యూదుడిగా జన్మించి, లేఖనములపై లోతైన అవగాహన కలిగియున్న అపోల్లో, దేవుని వాక్యమును అనర్గళంగా మరియు ప్రజలను ఒప్పింపజేసే విధముగా బోధించేవారు. అపొల్లోను గురించి “అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించెను" అని బైబిలులో అపొస్తలుల కార్యములు 18 : 25 లో చెప్పబడుతుంది. క్రీ. శ. 54 వ సం  లో ఎఫెసుకు వచ్చిన అతను, అక్కడి సమాజమందిములో యేసును గూర్చిన సంగతులను ధైర్యముగా బోధించారు. అయితే, సువార్తను గురించిన అతని జ్ఞానం అసంపూర్ణమైనదిగా ఉంది. ఏలయనగా అతను బాపిస్మమిచ్చు యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరిగియున్నారు. కాగా, ఎఫెసులో అపొస్తలుడైన పౌలు యొక్క స్నేహితులైన అకుల మరియు ప్రిస్కిల్ల అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరింత విపులముగాను, సంపూర్ణముగాను అతనికి విశదపరిచారు . 

                  అప్పుడు సువార్త యొక్క సంపూర్ణ జ్ఞానముతో ఆత్మయందు మరింత తీవ్రత గలవారై క్రీస్తును గురించి ప్రకటించడం ప్రారంభించారు. అపొల్లో, అతను అకయ అనే ప్రాంతమునకు వెళ్ళవలెనని తలంచినప్పుడు, ఎఫెసులోని సహోదరులు అతనిని ప్రోత్సాహించి, అకయలోని శిష్యులకు అపొల్లోను చేర్చుకొనుమని వ్రాయగా, అపొల్లో పరిచర్య చేయుటకు ఆ ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ అతను యూదులను ధైర్యముగా ఎదుర్కొని, యేసు యొక్క దైవత్వం గురించి బహిరంగముగా చర్చించారు. యేసే క్రీస్తు అని, వాగ్దానం చేయబడిన మెస్సీయ ఆయనేయని లేఖనములద్వారా అతను దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించారు. అంతేకాకుండా అతను అకయలోని విశ్వాసులకు ఎంతో సహాయము చేశారు. 

            తరువాత అపోల్లో కొరింథుకు వెళ్ళి, అక్కడి క్రైస్తవుల మధ్య సేవ చేశారు. ఉత్తమమైన ఆత్మీయ వరములను కలిగియున్న అతను, అపొస్తలుడైన పౌలు ద్వారా ప్రభువు వద్దకు నడిపింపబడిన క్రైస్తవుల మధ్య పరిచర్యను జరిగించారు. పౌలు సువార్తికునిగాను మరియు సంఘములను స్థాపించువానిగాను పరిచర్య చేయగా, అపొల్లో పౌలు నాటిన విత్తనముకు జాగ్రత్త వహించి నీళ్లు పోసిన బోధకునిగా ఉన్నారు. కొరింథులోని అతని పరిచర్య సువార్త విత్తనం నాటబడిన ప్రజలకు తదుపరి పరిచర్యను కొనసాగించవలసి ఆవశ్యకతను ఎత్తి చూపేదిగా ఉంది. 

             పౌలు అపొల్లోను విలువైన సహపరిచారకునిగాను మరియు తన స్నేహితునిగాను భావించారు. కొరింథు మరియు క్రేతులలో పరిచర్య చేయుటలో పాలు అపోలోకు ప్రోత్సాహమందించారు. అపోల్లో యొక్క తదుపరి జీవితం గురించి చరిత్రలో అంతగా దాఖలు చేయబడకపోయినప్పటికీ, అతను దేవుని ద్రాక్ష తోటలో శ్రమించి పనిచేశారని, అపొస్తలుల పరిచర్యకు సహకారిగా ఉన్నారని మరియు సంఘము కట్టబడుటలో నమ్మకముగా పరిచర్య చేశారనునది మాత్రం మనకు విశదమే ! 

             🚸*ప్రియమైన వారలారా, సువార్తను సంపూర్తిగా నేర్చుకొనుటకు మీరు ఇష్టపడుతున్నారా ?* 🚸

             🛐*ప్రభువా, వాక్యమనే విత్తనం విత్తబడిన చోట తదుపరి పరిచర్యను కొనసాగించి, మీ సంఘము కట్టబడుటలో కీలకముగా వ్యవహరించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్ !*🛐
*********
*ఒక మిషనరీ జీవిత చరిత్ర* ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే, ఇతరులు కూడా ప్రయోజనం పొందులాగున దీనిని అందరికీ పంపి, *ప్రభువును సేవించుటకు* వారిని ప్రోత్సహించ మనవి!
*********
తెలుగు అనువాదం: ఆర్ . ఆర్ . ప్రియాంక 

No comments: