దేవా, రాజునకు నీ న్యాయవిధులను, రాజ కుమారునికి నీ నీతిని తెలియజేయుము. కీర్తన: 72:1

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేడు దిన ధ్యానము:

(నాయకుడు)
దేవా, రాజునకు నీ న్యాయవిధులను, రాజ కుమారునికి నీ నీతిని తెలియజేయుము. 
కీర్తన: 72:1

చాలా మందికి దేశాలకు, రాష్ట్రాలకు, అనేక ప్రాంతాలకు నాయకులు కావాలని ఇష్టము. కీర్తన 72 “ఒక ఆశీర్వదింపబడిన నాయకుని” గురించి స్పష్టమైన చిత్రాన్నిస్తుంది. ఇక్కడ దావీదు రాజు దేవుని న్యాయవిధులను, నీతిని, రాజునకు, రాజ కుమారునికి ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు అతడు దేవుని ప్రజలను నీతితో, పేద ప్రజలను న్యాయముతో పరిపాలించగలనని అంటున్నాడు. నాయకుడు కావడమనేది అంత సుళువైన ఉద్యోగం కాదు, అంత చిన్న పని కాదు. దానికి అనేక భాద్యతలున్నాయి. మన నాయకత్వం క్రింద నున్న ప్రతి ఒక్కరి గురించి దేవునికి లెక్కచెప్పాలి. మనుష్యులకు, పక్షపాతము లేకుండా న్యాయం తీర్చాలి. ఇంకా నాయకుడు ప్రజల శారీరక, ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సినవన్నీ అందించగలగాలి. 7వ వచనంలో దావీదు చెప్పినట్లుగా “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును.” “దేశములోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును.నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు.” 16 వ వచనం. ఇంకా అనేక ఆశీర్వాదాలు ఈ కీర్తనలో వ్రాయబడియున్నవి. కనుక ప్రతి నాయకుడు, దేవుని నడుపుదల కొరకు, జ్ఞానము కొరకు, నీతి కొరకు ప్రార్థించాలి. ఇంకా యేసయ్యను రాజుగా ఉంచుకోవాలి. అప్పుడు దేశమంతా ఆశీర్వదించ బడుతుంది.

ప్రార్థన:

ప్రియమైన తండ్రీ, మా ప్రజలను ప్రేమతోనూ, న్యాయంగానూ పరిపాలించునట్లు మాకు జ్ఞానమును మరియు నీతిని అనుగ్రహహించమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

దైవ సేవకుడు కుర్చీలు, బెంచీలు, పరిశుద్ధ బల్ల మరియు ప్రజల నోళ్లను నింపవచ్చును. కానీ ఆ సేవకుడు సర్వశక్తుని యెదుట రహస్యంగా మోకాళ్ళ మీద ఉండడం అనేది నిజమైన ‘సేవకుడు’ అంతే కానీ వేరొకటి కాదు – జాన్ ఓవెన్.

No comments: