స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.– యెషయా : 49:15-16.

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేడు దిన ధ్యానము:-

(శ్రధ్ధ చూపే దేవుడు)

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.
– యెషయా : 49:15-16.

పచ్చ బొట్టు సంస్కృతి ఈ కాలంలో మరీ ఎక్కువైపోయింది. ప్రేమికులు తాము ప్రేమించిన వ్యక్తుల కొరకు, తమ ప్రేమను వ్యక్తపరిచే విధంగా శరీర భాగాలన్నింటి మీద పచ్చబొట్టు వేసుకుంటున్నారు. ఆ పచ్చబొట్టు చూసినప్పుడంతా వాళ్ళకి వాళ్ళ ప్రేమ గుర్తు వస్తుందని వాళ్ళనుకుంటున్నారు. ఇక్కడ మన దేవుడు “చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి యున్నాను” అంటున్నారు. ఇంకా “నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి” అంటున్నారు. “ఒకవేళ మీ తల్లి మరిచిపోయిన నేను మిమ్మలను మరువను” అని అంటున్నారు.

మా పరిచర్యలో కొన్నిసార్లు సొంత తల్లి కూడా శ్రద్ద వహించకపోవడం నేను చూశాను. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఒక వయస్సు వచ్చిన తర్వాత వారిని ఎవరు చూసుకుంటారో అనే బెంగతో చాలా స్వార్ధపరులు కావడం చూశాను. పిల్లల నుండి చాలా ఆశించే వారిని కూడా చూశాను. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత చేసినా కూడా, సహాయ పడినా కూడా తృప్తి పొందకపోవడం కూడా చూశాను. ఇంకా వాళ్ళు కృతజ్ఞత లేకపోగా, పైగా “మేము పెంచి పెద్ద చేశాము, కనుక మీరు మాకు చేయాల్సిందే” అని పిల్లలతో కొంతమంది అంటున్నారు.

కానీ మన పరలోకపు తండ్రి ఏ షరతులు లేకుండా మనలను ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన మనలనుండి ఏది కూడా ఆశించకుండా ప్రేమిస్తారు . మనలను సొంత పిల్లల్లాగా ఆయన చూసుకుంటారు. ఆయన కుమారుడైన యేసు ప్రభువు రక్తము ద్వారా మనలను ఆయనకు వారసులుగా కూడా చేశారు. కనుక అద్భుతకరుడైన, ప్రేమకలిగిన మన పరలోకపు తండ్రికి కృతజ్ఞులమైఉందాము.

ప్రార్ధన:
ప్రియమైన తండ్రీ , మా ఊహకు మించిన, మీ సమృద్ధి అయిన ప్రేమను అనుభవించే హృదయమును మాకివ్వమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

ఆపద వచ్చినప్పుడు నీ పైన శ్రద్ధ చూపే దేవుని శక్తి మీద దృష్టి కేంద్రీకరించు. – చార్లెస్ స్టాన్లీ.



No comments: