Parama vaidyuda bharateeyula పరమ వైద్యుఁడ భారతీయుల

599
క్రీస్తు అనుగ్రహించు స్వస్థత
రా - మిశ్రమ, తా - ఆది
(ఛాయ: శరణు జొచ్చితి)

పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ||

1.ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ||

2.భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా ||పరమ||

3.కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ||

4.లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చుమా ||పరమ||

5.యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా ||పరమ||

6.గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా ||పరమ||

7.దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ||

8.దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ||
- మల్లెల దావీదు 

No comments: