179
సిలువ యెదుట హృదయవేదన
రా - ధన్యాసి, తా - ఆది
నా యన్న రాఁగదే - ఓ యేసు తండ్రి - నా యన్న రాఁగదే = నా ప్రాణ ధనమా - నా పట్టుకొమ్మా - నా ముద్దు మూట - నా ముక్తిబాట - నా యన్న రాఁగదే = నా యన్న సిలువలో నీ - వాయాసపడిన నాఁటి - నీ ¹యంఘ్రియుగమునిపుడు - నా యాసఁదీరఁజూతు ||నా యన్న||
1.ఒక తోఁట లోపట - నాఁడు పడిన - సకల శ్రమ లిచ్చోట = ²నికటమై యున్నట్లుగా - నిట్టూర్పులతోఁ దలంతు - నకట నా రాతి గుండె - ³శకలంబై పోవునట్లుగా ||నా యన్న||
2.పరమాశ్చర్యము గాదా - యీలాటి ప్రేమ - ధరణిలో నున్నదా = చురుకౌ ముల్లుల పోట్లకు నీ - శిరము నా వంటి నీచపు - పురుగు కొరకం దిచ్చెడు నీ - కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||
3.ఇచ్చక మిది గాదు - మిగులఁ దలపోయ - ముచ్చట దీరదు = అచ్చి వచ్చిన నా - యవతారుఁడ నీ ప్రక్క - గ్రుచ్చు గాయము లోపల నేఁ - జొచ్చి నీ ప్రేమఁ జూతు ||నా యన్న||
4.తల వంచి సిగ్గున - నేఁ జేయు నేర - ముల నెంతు నాలోనఁ = బలు మారు నీ గాయములఁ - గెలికి నిన్ శ్రమపరచు నా - ⁴ఖల దోషములకై యిపుడు - పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||
- పురుషోత్తము చౌదరి
__________________________________
¹రెండు పాదములు, ²సమీపము, ³ముక్క, ⁴దుష్టమైన,
No comments:
Post a Comment