150
లాజరును తిరిగి బ్రతికించుట
రా - శంకరాభరణం, తా - ఆది
వినరె మనుజులార క్రీస్తుఁ - ¹డిలనుఁ జేయు ఘనములైన = పనులలోనఁ జిత్రమొక్క - పని ²వచించెద ||వినరె||
1.మన మనంబు ³లలరుచుండ - దినదినంబు ప్రభుని నిండు = ఘన మహాద్భుతములు వినినఁ - ⁴దనివిఁ దీరదు ||వినరె||
2.ఇలను బేతనియపురంబు - గలదు మరియ మార్తలక్క = సెలియలందు వాసముండి - ⁵రెలమితోడను ||వినరె||
3.పరిమళంపు తైలమేసు - చరణములకుఁ బూసిన యీ = మరియ సోదరుండు రోగ - భరితుఁడయ్యెను ||వినరె||
4.వ్యాధిచేత లాజరుండు - బాధనొందుచుండఁ గ్రీస్తు = నాధుఁ బిలువనంపి రపుడు - ⁶నాతు లిరువురు ||వినరె||
5.తమ్ము డక్క సెలియలును బ్రి - యమ్ము తనకుఁ గలిగియుండ = నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ - ⁷డరిగె నచటికి ||వినరె||
6.యేసువచ్చు టెఱిగి మార్త - యెదురు గానుఁ బోయి తనదు = దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు - తోడ బల్కెను ||వినరె||
7.కర్త నీకు దేవుఁడిచ్చు - ఘనబలమెఱుగుదును సత్య = వర్తి విచట ⁸లేని కతన - ⁹వ్రాలె లాజరు ||వినరె||
8.పిదప మరియవచ్చి క్రీస్తు - ¹⁰పదయుగమున ¹¹కొరిగి యేడ్చి = మొదట మార్త పలికినట్లు - ¹²సుదతి పలికెను ||వినరె||
9.అపుడు కర్త వారిపలుకు - లాలకించి మదిని మూల్గి = కృపకుఁ బాత్రు రాలితోడ - నపుడు నడిచెను ||వినరె||
10.నడిచి లాజరుని సమాధి - కడకుఁ జేరి గుహను మూయఁ = బడిన రాయి తీయుఁడనుచుఁ - ప్రభువు చెప్పెను ||వినరె||
11.యేసుతోడ మార్తపలికె - నీ సమాధినునిచి నాల్గు = ¹³వాసరంబులయ్యెఁ గంపు - పట్టి యుండదా ||వినరె||
12.దాని నమ్మి చూడుమని మ - హానుభావుఁ ¹⁴డాత్మబలము = ¹⁵నూని తండ్రికిపుడు స్తోత్ర - మొనరఁజేసెను ||వినరె||
13.లాజరు సమాధినెడలి - రమ్ము లెమ్మటంచు ¹⁶లోక = పూజితుఁడు మహా ¹⁷రవంబుఁ - ¹⁸బూని పల్కెను ||వినరె||
14.మరణమైనవాఁడు ప్రాణ - భరితుఁడగుచు లేచి వచ్చెఁ = ¹⁹తరుణులధిక ²⁰హర్షలైరి - ²¹పెదజనంబుతో ||వినరె||
15.కన వినంగ రాని యిట్టి - ఘన మహాద్భుతంబుఁ జూచి = జనులు క్రీస్తు యేసునాధు - ననుసరించిరి ||వినరె||
16.కనుక మనము వానిఁ జేరు - కొని సుఖంబుఁ బడయవచ్చు = మనసు నిలిపి యతనియందు - ²²మనుట మేలగున్ ||వినరె||
– పురుషోత్తమ చౌదరి
----------------------------------------
¹భూమిలో. ²చెప్పెద. ³ప్రకాశించుచుండు. ⁴తృప్తి. ⁵సంతోషము. ⁶స్త్రీలు. ⁷పోయె. ⁸లేనందున. ⁹మరణమొందెను. ¹⁰రెండు పాదములకు. ¹¹మ్రొక్కి. ¹²స్త్రీ. ¹³దినములు. ¹⁴స్వకీయమైనబలము. ¹⁵ధ్వని. ¹⁶వహించి. ¹⁷లోకముచేత పూజింపబడదగినవాఁడు. ¹⁸వహించి. ¹⁹స్త్రీలు. ²⁰సంతోషించిరి. ²¹ఇతర. ²²బ్రతుకుట.
No comments:
Post a Comment